రాయపర్తి/వరంగల్ చౌరస్తా, జూలై 11 : పోలీసుల నిర్లక్ష్యంతో మృతదేహం మారిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఎంజీఎం దవాఖాన మార్చురీకి తిరిగి తరలించిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన రమకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టె కు చెందిన గోక కుమారస్వామి(55)తో 35 ఏండ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె ఉన్నది. జీవనోపాధి కోసం కొంతకాలం వీరు సూరత్‌కు వెళ్లగా కుమారస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. కుమారస్వామి తొర్రూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో ఈ నెల 9న వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి సమీపంలో గాయపడగా పోలీసులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతిచెందాడు. పోలీసుల సమాచారంతో మృతుడి భార్య ఎంజీఎంకు వెళ్లి మృతదేహాన్ని చూసి నిర్ధారించారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి అప్పగించారు. శుక్రవారం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా మైలారం తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగా కుమారస్వామి శవం బదులు మరో మృతదేహం ఉన్నదని ఆరోపిస్తూ ఎంజీఎం దవాఖాన మార్చురీకి తిరిగి తరలించారు. ఈ విషయంపై వైద్యాధికారులు మాట్లాడుతూ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసుల నుంచి స్వాధీనం చేసుకొని పరీక్షల అనంతరం తిరిగి అప్పగించడం వరకే తమ బాధ్యత అని, కుటుంబసభ్యులకు చూపించి మృతదేహాన్ని వారికి అప్పగించే బాధ్యత పోలీసులదేనని తెలిపారు. కుమారస్వామి మృతదేహం ఎక్కడ మిస్ అయ్యిందనేది తెలియాల్సి ఉన్నది.