Telangana Emblem | వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగించే నిర్ణయాన్ని వాయిదా వేయడం కాదని, తప్పకుండా విరమించుకోవాల్సిందేనని వరంగల్ నగర ప్రజలు తేల్చి చెప్పారు. ఆ ప్రతిపాదనను పూర్తిగా విరమించే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్) ఫౌండేషన్, బీఆర్ఎస్ సంయుక్తంగా వరంగల్‌లోని కాళోజీ జంక్షన్లో శుక్రవారం నిర్వహించిన మానవహారంలో ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు. కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాకతీయ కళాతోరణం రాచరికం గుర్తు కాదని, అది ఉమ్మడి వరంగల్ జిల్లా రాజసం అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ చెప్పారు. వెయ్యేండ్ల సాంస్కృతిక, వారసత్వ సంపదకు కళాతోరణం ఒక సాక్ష్యం అని తెలిపారు. కాకతీయ చరిత్రను చెరిపివేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. కాకతీయ కళాతోరణం రాచరికానికి గుర్తు అన్న సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానానికి చింతిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, చరిత్రపై అవగాహన లేని వ్యక్తి తెలంగాణ, ఓరుగల్లు చరిత్రను చెరిపివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులకు అదరం బెదరం అని పేర్కొన్నారు. చరిత్ర గుర్తులను తొలగిస్తుంటే వరంగల్ జిల్లా మం త్రులు వ్యతిరేకించకపోవడం సిగ్గుచేటన్నారు. మం త్రులు సురేఖ, సీతక దీనిపై స్పందించాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాకతీయ కళాతోరణం తీసివేసే అనాలోచిత నిర్ణయాన్ని పునరాలోచించాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సూచించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను గుర్తించే కళాతోరణాన్ని రాజముద్రంలో పెట్టారని చెప్పారు. రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణం తొలగిస్తే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. కాళోజీ ధికార స్వరాన్ని చూపిస్తామని చెప్పారు. ఆందోళనలో టార్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ ఆర్య, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, సోదా కిరణ్, రంజిత్‌రావు, సంకు నర్సింగ్, ఇమ్మడి రాజు లోహిత, రాజునాయక్, బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ పాల్గొన్నారు.
రాష్ట్ర రాజముద్ర నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించాలనుకోవడం అవివేకం. ఇప్పటికిప్పుడు ఎందుకు రాజముద్రను మార్చాల్సి వచ్చింది. ప్రజలు పరిపాలన చేయాలని అధికారం చేతికి ఇస్తే ప్రజలకు ఏం అవసరాలున్నాయో వాటికి అనుగుణంగా పాలన చేయకుండా తెలంగాణ అస్థిత్వ చిహ్నాలను మారుస్తామంటే ఎలా? ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, మేధావులు, కవులు, రచయితలు ఎవరూ స్వాగతించరు. రాజముద్రలో ఉన్న చిహ్నాలను కొనసాగించాలి.
-కోదారి శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు,
‘వేల ఏండ్ల క్రితం రాజుల పాలనలో నిర్మించిన కట్టడాలను రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించలేం. వాటిని ముమ్మాటికీ సాంస్కృతిక వారసత్వాలుగానే చూస్తాం. వరంగల్లులో కాకతీయ తోరణాలను తోరణ ద్వారాలని, హంస ద్వారాలని, కీర్తి తోరణాలని చరిత్రకారులు రాశారు. ప్లేగు వ్యాధి తగ్గేందుక ప్రార్థించిన స్థలంలోనే మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించాడు. అప్పటి కట్టడాలను సాంస్కృతిక సందపగానే గుర్తించాలి తప్ప, రాచరికపు ఆనవాళ్లుగా చూడటం సబబు కాదు.
– శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకుడు
కాకతీయుల సుపరిపాలనకు ఓరుగల్లు కీర్తిని చాటేది కళాతోరణం. ఎంతో చారిత్రక గుర్తింపు ఉన్న చిహాన్ని రాజముద్ర నుంచి తొలగించాలని ప్రభుత్వం చూస్తున్నది. మరోసారి పునరాలోచించి కాకతీయ కళా తోరణాన్ని యథావిధిగా ఉంచాలి. కళాతోరణం తొలగింపును ప్రతి ఓరుగల్లు బిడ్డ వ్యతిరేకించాలి. ఈ మేరకు సీఎంవో కార్యాలయానికి మెయిల్ కూడా పెట్టాం.
– కామిడి సతీశ్‌రెడ్డి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం అధ్యక్షుడు