హనుమకొండ, జనవరి 12: బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడితే ప్రతిదాడులు చేస్తామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ హెచ్చరించారు. ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ మూకల దాడిని తీవ్రంగా ఖండించారు.
పార్టీలు ఏవైనా, వాటి కార్యాలయాలు ఆయా పార్టీలకు పవిత్ర దేవాలయాలవంటివని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారని చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శాంతియుత మార్గాన్ని సూచించారని, అదే మార్గంలో రాష్ర్టాన్ని సాధించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నిలదీస్తుంటే కక్షపూరితంగా ప్రతీకారచర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.