హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అధికారం ముసుగులో విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ, స్టోన్ క్రషర్స్ మాఫియాగా, వైట్‌కాలర్ క్రిమినల్‌గా అవతరించాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడికెళ్లినా ఆయన అక్రమాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. కవితను అడ్డంపెట్టుకొని బీఆర్ఎస్పై దుష్ట రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార మదంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పొంగులేటీ.. బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే సొంత పార్టీకి చెందిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత నీ దోపిడీపై సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పు?’ అని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు.
అన్ని కుటుంబాల్లో మంచి, చెడులు ఉంటాయని, కానీ, కవితను అడ్డంపెట్టుకొని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై నోటికొచ్చినట్టు మాట్లాడటం తీవ్ర ఆక్షేపణీయమని పేర్కొన్నారు. ‘మీరు కాంగ్రెస్‌లో ఉంటూ కవిత పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నారా? ఆమె పార్టీలో చేరుతున్నారా? లేదంటే కవిత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నారా?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ఎక్కడ చూసినా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎంత కొల్లగొట్టావు? నీ ఖాతాల్లో ఉన్న నగదెంతా? నీకున్న ఆస్తులెన్ని? దీనిపై చర్చకు సిద్ధమా?’ అని పొంగులేటికి సవాల్ విసిరారు. చిత్తశుద్ధి ఉంటే నీ ఆస్తుల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 22-ఏ సెక్షన్ ముసుగులో మంత్రి పొంగులేటి అరాచకాలకు పాల్పడుతున్నారని, ఆయన ఆదేశాలతోనే అధికారులు ప్రభుత్వ, అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.