హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): కులగణన నిలబడాలంటే డెడికేటెడ్ కమిషన్ వేయక తప్పదని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఆలస్యంగానైనా కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని.. ఇది మంచి నిర్ణయమని, ఈ సోయి ముందే ఉంటే బాగుండేదని రేవంత్ సర్కారుకు ఆదివారం ఎక్స్ వేదికగా చురకలంటించారు.
‘స్పష్టమైన చట్టాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాక కూడా దుందుడుకు, డొంక తిరుగుడు నిర్ణయాలేందుకు? కోర్టు తీర్పులు, ప్రజల ఒత్తిడి ఉంటేనే రాజ్యాంగబద్ధమైన నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇదే పద్ధతిలో జీవో 46, జీవో 29 విషయంలో ప్రభుత్వం భేషజాలకు పోకుండా, చేసిన తప్పిదాలను సరిదిద్ది, నిరుద్యోగులను ఆదుకోవాలని హితవు పలికారు. హైడ్రా, మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, ఉపాధి కల్పించి ప్రభుత్వం తన రాజ్యాంగ నిబద్ధతను చాటుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డికి దాసోజు సూచించారు.