హైదరాబాద్,డిసెంబర్ 29 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలోని దివ్యాంగులను ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. జీరోఅవర్‌లో దాసోజు శ్రవణ్ మానసిక దివ్యాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు. అంతకు ముందు మండలిలో వివిధ ఆర్డినెన్సులు, డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. అనంతరం శాసనమండలిని జనవరి 2వ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు.
ఇటీవల మరణించిన ప్రముఖ కవి, రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీకి శాసనమండలి పక్షాన సంతాపం తెలిపే అవకాశాన్ని పరిశీలించాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కోరారు. దీనిపై మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.
మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగరలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కోరారు.
ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి కోరారు. షాద్‌నగర్ మండలంలో గతంలో శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు, క్రిప్టో కరెన్సీ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వపరంగా పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ కోరారు.