Daasarathi Award | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను 2024 సంవత్సరానికి జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అవార్డుతోపాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను ఆయనకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా జగన్నాథంకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర దశాబ్దాల ప్రస్థానం కవిగా, రచయితగా జూకంటి జగన్నాథం ప్రస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాలు.
ఆయన స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రం. ఆయన 1993లో మొదటి కవితా సంకలనం పాతాళ గరిగెను విడుదల చేశారు. తర్వాత సుమారు 16 కవితా సంకలనాలు వెలువరించారు. ఆయన కవితలు కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లిష్‌లోకి అనువాదం అయ్యాయి. 2005లో జూకంటి కథలు, 2020లో జూకంటి జగన్నాథం కథలు పేరుతో కథా సంకలనాలు వెలువరించారు. ఆయనను పలు అవార్డులు రివార్డులు వరించాయి. 1998లో మొదటిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు. ఆయన 2014 నుంచి ఆలిండియా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.