హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వని పార్టీలను ఢిల్లీలో తిరగనివ్వబోమని బీసీల సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు అధ్యక్షుడు దాసు సురేశ్ హెచ్చరించారు. బీసీలకు దక్కాల్సిన హక్కుల విషయంలో రాజకీయ పార్టీలు సహకరించకపోతే ఎక్కడికక్కడ అడ్డుకొంటామన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆర్థిక పారిశ్రామిక, వాణిజ్య రంగాలు, సహజ వనరుల్లో సమాన వాటా, ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు సాధించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
కులాలవారీగా బీసీల జనగణన చేపట్టేందుకు పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘం పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు 11 మంది ముఖ్య నేతలు, 250 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సమావేశంలో సెంట్రల్ కమిటీ కన్వీనర్ ప్రకాశ్‌వర్మ, జనరల్ సెక్రటరీ కుప్పుస్వామి, మహిళా కన్వీనర్ పుష్పవర్మ, కో-కన్వీనర్‌గా హేమలత మెస్సీ, సెక్రటరీ చాయా దేవి, విద్యార్థి సంఘం అధ్యక్షుడు రజత్‌కుమార్, యువజన విభాగం అధ్యక్షుడు దీపక్ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.