నస్రుల్లాబాద్ : విద్యార్థుల జీవితాలకు తొలిమెట్టయిన 10వ తరగతి పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్నారు. గురుకుల పాఠశాలకు( Gurukula Students) చెందిన విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు ( Exams Centres) తరలింపులో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంగట్లో పశువులను, మేకలను, గొర్రెలను తరలిస్తున్నట్లు ఒకే వ్యాన్లో తరలిస్తుండడం తల్లిదండ్రులు కలవరపాటుకు గురువుతున్నారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో 78 మంది విద్యార్థులు నిన్నటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. అయితే ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్ గ్రామంలో పరీక్ష కేంద్రం ఉండడంతో గురుకుల అధికారులు విద్యార్థులను ఒకే డీసీఎం (DCM) లో తరలిస్తున్నారు.
ఇదిలా ఉండగా నస్రుల్లాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 23 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా వారిని ఆటోల్లో మిర్జాపూర్ కు తరలిస్తున్నారు. వాస్తవానికి విద్యార్థులకు ఆర్టీసీ బస్సులను గాని, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల విద్యాధికారి చందర్ ను వివరణ అడగగా విద్యార్థుల ట్రాన్స్పోర్టేషన్ తన దృష్టికి రాలేదని అన్నారు.