రామగిరి, జూలై 17: సింగరేణిలో పండుగపూట ఘోర ప్రమాదం జరిగింది. రామగుండం-3 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్టు-2 (ఉపరితల గని)లో సైడ్‌వాల్ కూలి ఇద్దరు కార్మికులు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీకి చెందిన ఉప్పుల వెంకటేశ్వర్లు ఫిట్టర్‌గా, ఇదే కాలనీకి చెందిన మాదం సమ్మయ్య, ఫైవ్ ఇంక్లెయిన్ కాలనీకి చెందిన గాదం విద్యాసాగర్, పెద్దపల్లికి చెందిన ఎర్రం శ్రీనివాస్‌రాజు ఓసీపీ-2 (ఉపరితల గని)లో జనరల్ మజ్దూర్లుగా పనిచేస్తున్నారు. మూడు రోజులుగా గనిలోని క్వారీలో హైవాల్ సంప్ వద్ద పైప్‌లైన్ మరమ్మతులు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సెకండ్ షిప్ట్ డ్యూటీకి హాజరయ్యారు. క్వారీ వద్ద పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు సైడ్‌వాల్ కూలి మీద పడటంతో వెంకటేశ్వర్లు (58), విద్యాసాగర్ (34) అక్కడికక్కడే మృతిచెందారు. పక్కనే ఉన్న కార్మికులు శ్రీనివాసరాజు, సమ్మయ్యకు గాయాలు కాగా, వారిని సెంటినరీకాలనీ డిస్పెన్సరీలో చేర్పించారు. వెంకటేశ్వర్లు, విద్యాసాగర్ మృతదేహాలను గోదావరిఖని సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు. కాగా, డ్యూటీకి వెళ్లిన కొద్ది గంటలకే తమ ఇంటి పెద్దలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ జీవీ రెడ్డి ఇదే ఏరియాలో పర్యటించి భద్రతా చర్యలపై అధికారులతో సమీక్షించి వెళ్లిన కొద్ది గంటలకే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
ప్రమాదంపై కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కన్నెర్ర చేశారు. ప్రతికూల పరిస్థితిలో వర్షంలోనూ పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశంలో మరమ్మతులు చేయడం కష్టతరంగా ఉన్నదని ఉప్పు వెంకటేశ్వర్లు మూడు రోజులుగా చెప్తున్నా అధికారులు పట్టించుకోలేదని, పైగా పనిచేయాలని ఒత్తిడి చేసి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. పని స్థలం వద్ద ఒక ఇంజినీర్, సూపర్వైజర్ ఉండి పనులు కొనసాగించాల్సి ఉండగా, అక్కడ ఎవరూ లేకపోవడం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతున్నదని మండిపడ్డారు.