Yellampalli Project | మంచిర్యాల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల శివారు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సగానికిపైగా ఖాళీ అయ్యింది.
ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు (148 మీటర్లు) కాగా, ప్రస్తుతం 10.9928 టీఎంసీలు (144.16 మీటర్ల) మాత్రమే నీరు నిల్వ ఉన్నది. ఎల్లంపల్లి నుంచి ఎన్టీపీసీ ప్లాంట్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్, నంది, వేంనూర్, గూడెం పంప్‌హౌస్‌లకు, పెద్దపల్లి-రామగుండం- మంచిర్యాల మిషన్ భగీరథ తాగునీటికి మొ త్తం కలిపి రోజూ 0.2648 టీఎంసీల నీరు అవసరం. క్యాచ్మెంట్ ఏరియా నుంచి 0.0293 టీఎంసీల నీరు వస్తున్నది.
ఈ లె క్కన ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కలిపితే ప్రస్తుతం ఉన్న నీరు కేవలం 46 లేదా 47 రోజులకే సరిపోనున్నది. అంటే మే నెలాఖరు వరకు కూడా నీరు సరిపోయే పరిస్థితి లేదు. అదే జరిగితే హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల పట్టణాలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.