Kangana Ranaut | ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీజేపీ మహిళా మోర్చా నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలను నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కులేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న బీజేపీ నేతలు.. దానంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరి దానం నాగేందర్‌కు కమిషన్ నోటీసులు జారీ చేస్తుందా? లేదా? చూడాల్సిందే.
ఇదిలా ఉండగా.. దానం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. నటిపై ఉపయోగించిన పదజాలం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కంగనా అభిప్రాయం, ఆ పార్టీ భావజాలంతో తాను ఏకీభవించడం లేదని, మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఢిల్లీ, తెలంగాణలోని నేతలు దానం వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఆశ్చర్యం ఉందన్న ఆయన.. ఆ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. గతంలో సోనియాను ఉద్దేశించి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను కేసీఆర్ ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయలను పక్కనపెట్టి నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు.