హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చే రిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందని, ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని చెప్పారు. గు రువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేసీఆర్‌ను చూడాలని ప్రజలంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నరు. ఆయన ఈ సభ కు వస్తున్నారు కాబట్టి ఆయనను చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలోనే వస్తరని నేను భావిస్తున్న. కేసీఆర్ సభ సక్సెస్ అవుతదని అనుకుంటున్న’ అని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ సభపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వడంపైనా దానం తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇందులో స్మితా సబర్వాల్ తప్పేమీ లేదని, అక్కడ జరిగిన వాస్తవాన్నే రీట్వీట్ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా సీఎస్ శాంతికుమారిని హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎస్ శాంతికుమారికి తన సర్వీస్‌లో ఎలాంటి చెడ్డపేరూ లేదని, ఒక్క మచ్చలేకుండా సర్వీస్ అందించారని చెప్పారు. అలాంటి ఆమె ఇప్పుడు గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టుతో తిట్లు తినాల్సి వచ్చిందని వాపోయారు. ఒక మంచి అధికారికి ఇలాంటి చికాకులు రావడం బాధాకరమని చెప్పారు. స్మితా సబర్వాల్ కూడా నిజాయితీగల అధికారి అని, వాస్తవాన్నే ఆమె రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా బద్నాం చేశారని తాను భావించడం లేదని చెప్పారు.