నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 28: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం నుంచి కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన వడ్లు తడిశాయి. మెదక్ జిల్లా కొల్చారంలో ఆశన్నగారి యాదమ్మకు చెందిన ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా విలపించింది. చిలిచిచెడ్ మండలం చిట్కుల్లో మెదక్-సంగారెడ్డి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. జగ్గంపేట, చండూర్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందారు. చిన్నశంకరంపేట మండలంలో ధాన్యం తడిసి ముద్దయ్యింది.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాజీపేట్లో పీఏసీఎస్ కొనుగోలుకేంద్రంలో కాంటా చేయకపోవడంతో ధాన్యం తడిసింది. అధికారులు కనీసం టార్పాలిన్లను పంపిణీ చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఖాజీపేటలో రైతులు తీసుకువచ్చిన ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. వెల్దుర్తితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో రైతులు లబోదిబోమన్నారు. అందోల్ మండలంలోని అందోల్, సంగుపేట, అల్మాయిపేట్ గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసింది. జోగిపేట మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం అయింది.