యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థల మూతే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ పాలన సాగుతున్నది. ఇప్పటికే పలు సంస్థలను నిర్వీర్యం చేయగా, తాజాగా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులపై దృష్టి పడింది వీటికి గతంలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసిన కేంద్రం.. ఇప్పుడు అదనపు మోత మోగిస్తున్నది. దీంతో పీఏసీఎస్‌లు, సింగరేణి, ఆర్టీసీ వంటి సంస్థలతోపాటు పెద్దపెద్ద కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. బల్క్‌లో కొనలేక బయట పెట్రోల్ పంపుల్లో, ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీటర్ డీజిల్‌పై అదనంగా రూ.25 వడ్డించడంతో నష్టాలు భరించలేక రాష్ట్రంలోని సొసైటీల పరిధిలో ఉన్న దాదాపు 340 బంకులు మూతపడ్డాయి. బంకుల మూతతో వేలాది మంది యువత ఉపాధికి గండిపడింది.
రూ.121కి కొనుగోలు.. రూ.96కు విక్రయం
పబ్లిస్ సర్వీస్ ఓరియెంటెడ్‌గా ప్రాథమిక సహకార సంఘాలు, జైళ్లు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులు, రైతులు, మహిళా, పద్మశాలీ, యాదవ సొసైటీల ఆధ్వర్యంలో నడిపే బంకుల్లో సామాన్యులకు పెట్రోల్, డీజిల్ అమ్మేవారు. ఆర్టీసీ, సింగరేణి తదితర పెద్ద కంపెనీలు కూడా కన్జ్జూమర్ పెట్రోల్ బంకులను కొనసాగించేవి. వాటికి ఆయిల్ కంపెనీలు రిటైల్ బంకుల కంటే కొంత తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేవి. అలా కొంత లాభం చూసుకొని కస్టమర్లకు విక్రయించేవారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో ఈ ఏడాది మార్చి నుంచి కన్జూమర్ బంకులకు డీజల్ అధిక రేట్లకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ బంకులకు లీటర్ డీజిల్ రూ.121కి సరఫరా చేస్తున్నారు. అంటే లీటర్ రూ.121 కొని.. మార్కెట్లో రూ.96కి అమ్మాలి. దాంతో ఒక్కో లీటరుపై అదనంగా రూ.25 నష్టం చవిచూడాల్సి వస్తున్నది.
కేంద్ర మంత్రులకు విన్నవించినా
డీజిల్ రేట్ల పెంపుతో బంకులు నడువలేని పరిస్థితి ఏర్పడింది. బంకులు మూతపడటంతో రాష్ట్రంలోని సొసైటీలు అనేకమార్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు. కన్జూమర్ డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని లిఖితపూర్వకంగా ఎన్నోసార్లు విజ్ఞప్తిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా వినతిపత్రాలు అందించారు. కానీ, ఇప్పటివరకు కనీస స్పందన రాలేదు. ఆరు నెలలుగా పెట్రో ధరలు తగ్గినా బల్క్‌లో మాత్రం తగ్గించడం లేదు. ఓ వైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే రేట్లు పెంచడమేంటని సొసైటీ బంకుల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువత ఉపాధికి గండి
సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న బంకుల్లో స్థానిక యువత పని చేస్తున్నారు. ఒక్కో బంకులో 5 నుంచి 8 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.15 వేల జీతం లభిస్తున్నది. ఇప్పుడు బంకులు మూతపడటంతో వారందరి ఉపాధికి గండి పడింది. కేంద్రం నిర్ణయం సొసైటీలకు కూడా భారం అవుతున్నది. బంకులు నడువకున్నా స్థలం అద్దె కట్టాల్సి వస్తున్నది. కరెంట్ బిల్లులు, ఇతర ఖర్చులు భరించాల్సి వస్తున్నది. బంకుల మూతతో స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధరలు వెంటనే తగ్గించాలి
కేంద్రం రైతు వ్యతిరేక చర్యల్లో సొసైటీ బంకుల మూత ఒకటి. రిటైల్‌లో తక్కువ ధరకే ఇచ్చి.. కన్జూమర్ బంకులకు అధిక రేట్లకు ఇవ్వడంలో ఆంతర్యమేంటి? కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటి. కార్పొరేటు వ్యవస్థలకు కార్పెట్ వేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు ఇచ్చే రేటుకు అమ్మడంతో ఒక్కో లీటర్‌పై అదనం గా రూ.25 భరించాల్సి వస్తున్నది. దీంతో ఇప్పటికే 340 బంకులు మూతబడ్డాయి. దీనికి మోదీ సర్కారు తీరే కారణం. ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రులను కలిసి విన్నవించాం. కన్జూమర్ బంకులకు తక్కువ ధరకే పెట్రోల్ సరఫరా చేయాలి.
– జీ మహేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్, నల్లగొండ