బడంగ్‌పేట, జూన్ 27: కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ఓ దళిత యువకుడిపై బీజేపీ నాయకులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ వైఎస్సార్ కాలనీలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జి అందెల శ్రీరాములుయాదవ్ మంగళవారం సాయంత్రం జన సంపర్క్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్థానిక దళిత యువకుడు ముత్యాల నర్సింహ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు కించిత్తు సాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం తప్ప ఏమి చేసిందని ప్రశ్నించారు. దీంతో కన్నెర్రజేసిన బీజేపీ నేతలు ముత్యాల నర్సింహపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడి నుంచి కొట్టుకుంటూ చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లారు. తనపై దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని నర్సింహ పేర్కొన్నారు. బీజేపీ కండువా కప్పుకోవాలంటూ బలవంత పెట్టారని, అందుకు తాను నిరాకరించడంతో కాళ్లతో తన్నారని ఆరోపించారు. ఇదంతా అందెల శ్రీరాముల కండ్ల ఎదుటే జరుగుతున్నా దాడిని నివారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిపై దళిత యువకుడు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, దాడికి పాల్పడ్డవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ కిరణ్‌కుమార్ తెలిపారు.