పెద్దపల్లి టౌన్, మే 2: కాంగ్రెస్ పార్టీ డబ్బులున్నోళ్లకే టికెట్లు కేటాయించిందని దళిత సంఘం రాష్ట్ర నాయకుడు కంసాల శ్రీనివాస్ ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలకే ఎంపీ టికెట్లు కేటాయించడం దారుణమని అన్నారు. గురువారం ఆయన పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడారు. అనేక పార్టీల్లో బొంగరం మాదిరిగా, నిలకడలేకుండా తిరిగిన గడ్డం వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యే అయ్యారని, ఇప్పుడు ఆయన ఒక్క కుటుంబానికే మూడు టికెట్లు కేటాయించి మాదిగ జాతిని కాంగ్రెస్ అవమానించిందని విమర్శించారు.
వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్ఠానికి రూ.500 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దళిత వ్యతిరేక పార్టీలని, అందులో సామాజిక న్యాయం కొరవడిందని విమర్శించారు. తాము బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కే మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. నేతకాని సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్ల రాజమల్లు మాట్లాడుతూ రాజకీయ ఓనమాలు తెలియని గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.