నూతనకల్, నవంబర్ 15 : వరి కోతల వేళ సొంత పొలానికి వెళ్లేందుకు కొందరు కోతల యంత్రానికి దారి ఇవ్వడం లేదని మనస్తాపం చెందిన దళిత రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఏషమల్ల వెంకన్నకు సుమారు 5 ఎకరాల పొలం ఉన్నది. ఐదేండ్ల నుంచి వరి కోత కోయించే సమయంలో వరి కోత మెషిన్ వెళ్లకుండా ఉన్నత వర్గాలకు చెందిన వారు కొందరు అడ్డుపతున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకన్న గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా సూర్యాపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజక వర్గంలోనే దళిత రైతు వేధింపులకు గురికావడం గమనార్హం.