హైదరాబాద్, ఫిబ్రవరి13 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరును ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిరసనలకు దిగాయి. ఇదే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ హైదరాబాద్-విజయవాడ హైవే దిగ్బంధానికి పిలుపునిచ్చారు. నిరసనలో పాల్గొనకుండా ఆయనను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఎమ్మార్పీఎస్ పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో దళిత, ఉపకులాలతో పాటు వివిధ ప్రజాసంఘాల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అనంతరం విడిచిపెట్టారు.
వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడుతామన్న హామీని విస్మరించిన బీజేపీకి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. ఆయా చోట్ల నిరసనల్లో పాల్గొన్న పలువురు నేతలు మాట్లాడారు. ఎస్సీలకు బీజేపీ తీరని ద్రోహాన్ని తలపెట్టిందని, తొమ్మిదేండ్లుగా వర్గీకరణ చేపట్టడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో 57 ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింతల రాజలింగం, తోకల చిరంజీవి, ఎమ్మార్పీఎస్, ఎంజేఎఫ్ నేతలు పాల్గొన్నారు.