హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడైన ఉత్తరప్రదేశ్ రైతు నాయకుడు, దళిత ఉద్యమకారుడు రాఘవేంద్రకుమార్ తెలంగాణలో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రైతులపై ప్రభు త్వం చూపుతున్న శ్రద్ధ, పథకాల గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. జీహెచ్ఎంసీ సహా జిల్లాల్లోనూ నెల రోజులుగా ప్రచారం నిర్వహిస్తూ బీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నారు. విషయం తెలిసిన దక్షిణ భారత రైతు సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు ఆయనను సత్కరించారు.
తెలంగాణలో రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం ఉందని, అది వారి అదృష్టమని రాఘవేంద్రకుమార్ పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని వదులుకోవద్దని కోరారు. రైతుల క్షేమాన్ని కోరే బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వం తమకు లేదని, తమ రాష్ట్రంలో దళితులు, రైతులు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మరోమారు అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఈ పథకాలను అమలు చేస్తుందో.. లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్ సహా రాష్ట్రంలో స్థిరపడిన యూపీ వాసులకు ఆయన సూచించారు.