
కురవి, డిసెంబర్ 23: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, విద్యార్థి నేత దబ్బేటి మహేశ్ మరణించారు. కరోనాతో కోలుకున్న తరువాత మళ్లీ అస్వస్థతకు గురై నెల రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దబ్బేటి మహేశ్ (36) కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో పార్ట్‌టైం అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలరోజుల క్రితం కరోనా సోకడంతో మహబూబాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స తీసుకుంటూ వైద్యుల సూచన మేరకు వరంగల్‌లోని ఎంజీఎంలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆయనకు భార్య రోహిణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేశ్ మృతదేహానికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు దినేశ్‌కుమార్, రామచంద్రం, జేఏసీ నాయకులు నివాళులర్పించారు.