Telangana | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ‘దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు. 29 రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం మూడు రాష్ర్టాల్లో మాత్రమే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వాలు రెండు డీఏలు బాకీపడ్డాయి. ఉద్యోగులకు ఠంచన్‌గా అందాల్సిన డీఏలు పెండింగ్‌లో ఉండటం గర్హనీయం.’ ఇది ఇటీవల తెలంగాణ గెజిటెట్ అధికారుల సంఘం (టీజీవో) సమావేశంలో నేతల ఆవేదన.
డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీని ప్రకటించలేదు. హెల్త్కార్డులివ్వలేదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచింది లేదు. చర్చింది లేదు. మేం రెండువందల సార్లు కలిశాం. 80కి పైగా వినతిపత్రాలిచ్చాం. మా ఉద్యోగులకు మేం నచ్చజెప్పుకోలేకపోతున్నాం. ఉద్యోగసంఘాలు ప్రభుత్వంతో రాజీపడ్డాయని మా ఉద్యోగులే మమ్మల్ని నిందిస్తున్నారు’ ఇది ఒక ఉద్యోగ సంఘం నేత ఆక్రోశం.
ఉద్యోగులు, సంఘాల నేతలకు మంత్రులు కనీసం విలువనిస్తలేరు. ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లను కొందరు మంత్రులు పట్టించుకోవడం లేదు. మార్చిలోపు ఆర్థికేతర, మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారమవుతున్నాయన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు మేం ఇన్నాళ్లు ఓపికపట్టాం. సీఎం హామీ మేరకు ఆగినందుకు మేమంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని మా ఉద్యోగులే మమ్మల్ని తిడుతున్నారు. లేఖలు రాస్తున్నారు’ ఇది మరో ఉద్యోగ సంఘం నేత ఆక్రందన.
నెలా నెలా భారీ లాస్
ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ప్రతి ఉద్యోగి నెల నెలా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారు. మొత్తం 24 నెలల డీఏను సర్కారు బాకీపడింది. ఈ మొత్తం రూ.2.4 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు డీఏ ఇస్తే డీఏ మొత్తంతోపాటు ఏరియర్స్‌ను కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఖర్చులు తీవ్రమవుతుండటంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం డీఏలు విడుదల చేయకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు, నేతల్లోను అసహనం చెలరేగుతున్నది.
ఇచ్చింది ఒక్క డీఏ
కరువుభత్యం (డీఏ) ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరలు, ధరల సూచీ ప్రకారం ప్రభుత్వమే ఎప్పటికప్పుడు విధిగా డీఏలను విడుదలచేయాలి. ఇలాంటి డీఏల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులు, ఉపాధ్యాయులను దారుణంగా వంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు పెండింగ్ డీఏలుంటే ఒకేఒక్క డీఏను విడుదల చేసింది. అది కూడా డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని ఉస్సూరుమనిపించింది.
ఐదుకు చేరిన పెండింగ్ డీఏలు
ఎన్నికల సమయంలో పెండింగ్ డీఏలను తక్షణమే చెల్లిస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది. ఈ మేరకు మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఉద్యోగసంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగివచ్చిన సర్కారు ఎట్టకేలకు ఒకేఒక్క డీఏ విడుదలకు పచ్చజెండా ఊపింది. దీంతో పెండింగ్ డీఏలు నాలుగు అయ్యాయని అంతా అనుకున్నారు. అంతలోనే మళ్లీ జనవరి 2025 రావడంతో కొత్త డీఏ బాకీపడింది. దీంతో నాలుగు పెండింగ్ డీఏలు మళ్లీ ఐదుకు చేరాయి. దీంతో మళ్లీ పాత కథే అయ్యింది. ఇటీవలే కేంద్రం ప్రభుత్వం 3% డీఏను ప్రకటించింది. మరోవైపు ఈ నెల 6న క్యాబినెట్ సమావేశం జరగనుండటం, త్వరలోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు డీఏలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పిన ఒక్క హామీని కూడా అమలుచేయలేదు. ఏరియర్స్ సహా పెండింగ్ డీఏలు విడుదల చేస్తామన్నారు. పీఆర్సీ ఇస్తామన్నారు. విస్మరించారు. హెల్త్‌కార్డులు అయిపోయినట్టేనని చెప్పి అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఒక డీఏ ఇచ్చి ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన డీఏ కోసం మార్చి 31 వరకు ఆగమన్నారు. మార్చిలో ఇస్తారో లేదో అన్నది అనుమానంగా ఉన్నది. క్యాబినెట్ సమావేశంలో చర్చించి పెండింగ్ డీఏలను విడుదల చేయాలి.
– లక్ష్మయ్య, పెన్షనర్స్ జేఏసీ చైర్మన్