హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా (Cyber Attack) విసిరారు. భూ భారతి, ఆరోగ్యశ్రీ, మీ-సేవ, జీహెచ్ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్సైట్లను హ్యాక్‌చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతోపాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించినట్టు ‘సైబర్ హెల్ప్’ అనే ఎన్జీవో వెల్లడించింది. ప్రభుత్వంలోని 22 ప్రధాన విభాగాల డాటాను డార్ వెబ్‌లో (Dark web) అమ్మకానికి పెట్టినట్టు తెలిపింది. దీనితోపాటు తెలంగాణ పౌరుల ఆధార్, ఆరోగ్య వివరాలు, భూములకు సంబంధించిన డాటా సైతం సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఉన్నదని, దానిని అగ్గువకు అమ్మేసుకుంటున్నారని పేర్కొన్నది.
బగ్స్ ద్వారా డాటా చోరీ
రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లలోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పడ్డారని, అందుకోసం ప్రత్యేకంగా బగ్స్‌ను ఉపయోగించారని ‘సైబర్ హెల్ప్’ వెల్లడించింది. శాంపిల్ డాటా కోసం తమ వారియర్స్ ఎంక్వైరీ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై లోతుగా ఆరా తీయడంతో డాటా చౌర్యం జరిగినట్టు తేలిందని వివరించింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రభుత్వ వెబ్సైట్లలోని సెక్యూరిటీ లోపాలను సరిచేయకుండా గాలికి వదిలేయడం వల్లనే డాటా లీక్ అయి ఉంటుందని అంచనా వేసింది. ఈ వ్యవహారంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) దర్యాప్తు చేపడితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని, ప్రభుత్వ వెబ్సైట్లలో ఎకడెకడ డాటా లీక్ అయిందో? ఎక్కడ బగ్స్ ఉన్నాయో? తెలుస్తుందని చెప్తున్నది.
‘సైబర్ హెల్ప్’ విశ్లేషణతో వెలుగులోకి
సున్నిత సమాచారాన్ని డార్వెబ్లో ఎవరు అమ్ముతున్నారు? ఎలాంటి డాటాను అమ్ముతున్నారనే దానిపై ‘సైబర్ హెల్ప్’ వారియర్స్ టీమ్ నిరంతరం విశ్లేషణ చేస్తుంటుంది. ఆ క్రమంలో ఇటీవల తెలంగాణ పౌరులకు సంబంధించిన సమాచారం డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉన్నట్టు గుర్తించింది. దీనిపై లోతుగా ఆరా తీయడంతో దాదాపు 22 ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించిన డాటా చోరీ అయినట్టు తేలింది. దీనిపై అధికారులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తున్నది. ఈ విషయంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ‘సైబర్ హెల్ప్’ను సంప్రదించడంతో వారు సేకరించిన సమాచారాన్నంతా పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఢిల్లీకి చెందిన ఓ హ్యాకర్ తెలంగాణ పోలీస్ వెబ్సైట్ నుంచి డాటా చోరీ చేసి, డార్క్‌వెబ్‌లో అమ్మకానికి పెట్టాడు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనపోవడం, ఇప్పుడు ఏకంగా 22 కీలక విభాగాల డాటా చోరీ కావడంతో తెలంగాణ పౌరుల సమాచారం ఎంత వరకు భద్రంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తుతున్నది.