Cyber Crime | అలంపూర్, మే 21 : సైబర్ నేరగాళ్లు హెలికాప్టర్ నకిలీ టికెట్లు విక్రయించి న్యాయవాదులనే బురిడీ కొట్టించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు ఉత్తరాఖాండ్‌లోని కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. ప్రధాన ఆలయాన్ని చేరుకోవడానికి 22 కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. లేదా హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు. హెలికాప్టర్ ప్రయాణానికి ఒక్కొక్కరు దాదాపుగా రూ.5,500 నుంచి రూ.6 వేలు వెచ్చించి ఆన్లైన్లోని ఓ వెబ్సైట్లో టికెట్లు కొనుగోలు చేశారు.
ఏవియేషన్ సంస్థ నిర్వహించే హెలికాప్టర్ సర్వీసుల వద్దకు వారు మంగళవారం చేరుకున్నారు. హెలికాప్టర్ ఎక్కేందుకు గాను కొనుగోలు చేసిన టికెట్లు చూపించగా అవి నకిలీవని తేలింది. దీంతో న్యాయవాదులు కంగుతిన్నారు. నకిలీ వెబ్సైట్ నిర్వాహకుల గురించి ఆరా తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు.ఇలా వారు మాత్రమే కాదు వందలాది మంది యాత్రికులు నష్టపోయినట్టు తెలిసింది. ఈ విషయాన్ని న్యాయవాదులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. యాత్రకు వెళ్లిన వారిలో అలంపూర్ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు గవ్వల శ్రీనివాసులు, నాగరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.