హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. ఏడుచోట్ల సోదాలు చేసి రూ.2.23కోట్ల బెట్టింగ్ సొమ్మును స్వాధీ నం చేసుకున్నారు. 23మందిని అరెస్టు చేశా రు. ‘ఆపరేషన్ క్రికెట్ బెట్టింగ్’తో ముఠాల గుట్టురట్టుచేశారు. గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మహా.. సబ్ బుకీలతో కొంతకాలంగా తెలంగాణ, ఏపీలో క్రికెట్ బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నాడు. ఒక్కోమ్యాచ్‌కు దాదాపు రూ.2.50 కోట్ల వరకు బెట్టింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, శంషాబాద్ పోలీసుస్టేషన్ల పరిధిలో బుకీలు చింత వేణు, నాగళ్ల రాకేశ్, గోదావర్తి వెంకటేశ్ ద్వారా దందా సాగిస్తున్నాడు. సబ్‌బుకీలు మహాకు రూ.5 లక్షలు చెల్లించి లైన్ తీసుకుని, వాటిద్వారా మరికొందర్ని ఏజెంట్లుగా నియమించుకుంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రాథమిక సమాచారంతో సైబరాబాద్ పోలీసులు దాదాపు రెండునెలలపాటు ఆపరేషన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. మంగళవారం ముంబై- పంజాబ్ మ్యాచ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా ఏడుచోట్ల దాడులు చేశారు. మహా.. బెట్టింగ్ లింక్‌లు బెంగళూరు, ముంబయి, దుబాయి వరకు ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. ప్రధాన బుకీ మహాతోపాటు చెన్ను భాస్కర్‌రెడ్డి, సురేశ్, ప్రవీణ్, సుమన్, రామాంజనేయ, నంద్లాల్ గోరి పరారీలో ఉన్నారు. ముఠాను అరెస్టుచేసిన సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ శివ, ఎస్ఐ విజయ్‌వర్ధన్, మాదాపూర్ ఎస్వోటీ సిబ్బందిని సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. సిబ్బందికి రివార్డులు అందించారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బెట్టింగ్ ముఠాల కారణంగా చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికి వీధిన పడ్డాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.