హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాష్ట్ర మంత్రినే బెదిరించి డబ్బులు లాగేందుకు ప్రయత్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పేరిట నకిలీ నోటీసులు పంపించారు. ఓ కేసు విషయంలో మీతోపాటు మీ కుటుంబ సభ్యులను అరెస్టు చేయాల్సి ఉంది. లేదంటే మనం సెటిల్ చేసుకుందాం అంటూ ఉల్టా మంత్రికే ఆఫర్ ఇచ్చారు ఆ కేటుగాళ్లు. చివరకు విషయం ఈడీ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈడీ హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ నేరుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీగాళ్ల కోసం సైబర్ క్రైం పోలీసులు వేట మొదలు పెట్టారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను నకిలీ ఈడీ నోటీసుల పేరిట బురిడీ కొట్టించబోయిన కేటుగాళ్లపై సీసీఎస్‌లో కేసు నమోదైంది.
ఓ కంపెనీ లావాదేవీల వ్యవహారంలో మీరు, మీ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మీ సోదరులు, ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేయాల్సి ఉందంటూ తొలుత నోటీసులు పంపించారు. ఆ తర్వాత నేరుగా మంత్రి గంగుల కమలాకర్‌కు ఓ ల్యాండ్‌లైన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ‘మేం ఈడీ అధికారులం మాట్లాడుతున్నాం’ అంటూ బెదిరింపులు మొదలు పెట్టారు. అప్పటికే విషయం తేడాగా ఉందని గ్రహించిన మంత్రి గంగుల, ఆ ఫోన్ నంబర్ గురించి ఆరా తీశారు. అయితే అది ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ల్యాండ్‌లైన్ నంబరే ఉంది. ఆ తర్వాత ఆ నోటీసులను గమనించి చూడగా నోటీసులపైన ఈడీ జాయింట్ డైరెక్టర్ అని..నోటీసుల చివరల్లో డిప్యూటీ కమిషనర్ ఈడీ అని ఉండటాన్ని బట్టి ఇది నకిలీ నోటీసులు అని నిర్ధారణ అయింది. ఈ విషయం ఈడీ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీసీఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఈడీ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఆ ఫోన్ కాల్ అమెరికా నుంచి వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు.