
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): సైబర్ క్రైం కేసుల దర్యాప్తుపై హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. సైబర్ నేరాలకు అడ్డాగా పేరొందిన జార్ఖండ్‌లోని జామ్తారా దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 150 మంది సైబర్ నేరగాళ్లను వివిధ రాష్ర్టాల పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఈ నేరగాళ్లకు హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్ల పరిధిలో నమోదైన దాదాపు 300 కేసులతో సంబంధాలున్నాయని సైబర్‌క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. ఒకేసారి అంతమంది నేరగాళ్లను పీటీ వారెంట్లపై ఇక్కడకు తీసుకొచ్చే అవకాశాలు లేవు. ఇతర కేసుల దర్యాప్తు కోసం ఆయా రాష్ర్టాలకు వెళ్లినప్పుడే కొత్త కేసులతోపాటు పాత వాటిలోనూ నిందితులను పట్టుకొచ్చేలా కార్యాచరణను రూపొందిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పోలీసులు కేసుల దర్యాప్తునకు ఇతర రాష్ర్టాలకు వెళ్తున్న సందర్భంలో ఒకే బృందంగా ఏర్పడుతున్నారు.
పట్టుకుంటే సమాచారం
కేంద్రం సైబర్ నేరాలకు సంబంధించి 155260 టోల్‌ఫ్రీ నంబర్‌ను తెచ్చింది. దీనికి కాల్ చేసి నేరగాళ్లు ఏ నంబర్‌తో ఫోన్ చేశారు, ఏ బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయాలని సూచించారో ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నిందితుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదవుతున్న కేసుల సమాచారం సెంట్రల్ సైబర్‌నేరాల కంట్రోల్ రూంకు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ కాల్‌సెంటర్‌కు వచ్చే ఫిర్యాదులతో ఒకే నంబర్‌తో నేరగాడు ఎంత మందిని మోసం చేశాడనే విషయం తెలుస్తుంది. ఒకచోట సైబర్‌నేరగాడు అరెస్టయితే అతడి వద్ద స్వాధీనం చేసుకున్న సిమ్‌కార్డులు, వాడిన ఫోన్ నంబర్లను విశ్లేషించి, ఎన్ని కేసులతో సంబంధం ఉన్నదనే విషయాన్ని నిర్ధారిస్తారు. అన్ని రాష్ర్టాల సైబర్ విభాగాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తుండటంతో చాలామంది నేరగాళ్లు ఒక కేసులో అరెస్టయ్యారంటే.. బెయిల్‌పై బయటకు రావడానికి నెలల సమయం పడుతుంది.