హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కుప్పకూలింది, ప్రాజెక్టు పనికి రాదంటూ ఇన్నాళ్లూ కాంగ్రెస్ నేతలు చేసిన కుట్రలు, దుష్ప్రచారాలు ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు స్పష్టంచేశారు. అవసరాన్ని బట్టి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ తన అఫిడవిట్లో స్పష్టంచేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) అధికారుల పరిశీలనలో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్‌లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని, కాంక్రీట్ నాణ్యత కూడా బాగున్నదని వెల్లడైందని చెప్పారు.
అయినా రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పకన పెట్టి, తెలంగాణకు వచ్చిన గోదావరి నీటిని వినియోగించుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్‌రెడ్డి సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు. ప్రాజెక్టును నిందిస్తూ నీటిని లిఫ్టు చేయకుండా ఏపీకి వదిలిపెట్టడం ద్వారా తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తాము నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులు ఆన్‌చేసి వెంటనే ఆఫ్ చేశారని, అప్పటికే వరద నీరంతా కిందికి వెళ్లిపోయిందని మండిపడ్డారు. ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16 శాతం ఉండగా.. తెలంగాణలో మాత్రం 35.6% మాత్రమే! దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ జలాశయాల్లో నీటి నిల్వలు సగానికి చేరువలో ఉండటం దారుణం. ఇవి కేవలం అంకెలు కాదు.. తెలంగాణ రైతాంగానికి రాబోయే నీటి సంక్షోభానికి సంకేతాలు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ హయాంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. నేడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్‌తో పోటీ పడే దుస్థితికి చేరిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నీటి కొరతను అధిగమించిన తెలంగాణను.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ నీటి కష్టాల్లోకి నెట్టిందని మండిపడ్డారు. ‘నిండుగా పారిన గోదావరి, కృష్ణా నీళ్లను కిందికి విడిచిపెట్టి రాష్ట్రానికి చేసిన కాంగ్రెస్ ద్రోహ ఫలితం ఇది.
కమిషన్లు, విచారణలు వేయడంపై ఉన్న శ్రద్ధ.. గోదావరి, కృష్ణా జలాలను ఒడిసిపట్టి రైతులకు అందించడంలో ఎందుకు లేదు? ఎల్ నినో ప్రభావం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇది రాజకీయ కక్షలకు సమయం కాదు. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాల్సిన సమ యం. పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలపై శ్రద్ధ పకనపెట్టి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి హకులు, రైతుల ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. కాళేశ్వరంపై దుష్ప్రచారం మానేసి, అన్నారం, సుందిళ్ల మోటర్లు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలి. రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు అందివ్వాలి’ అని బీఆర్ఎస్ పక్షాన హరీశ్‌రావు డిమాండ్ చేశారు.