బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 01:07:41

అన్నపూర్ణ తెలంగాణ

అన్నపూర్ణ తెలంగాణ

-రాష్ట్రంలో యాసంగి వరి సిరులు.. 

-కోటి టన్నుల ధాన్యరాశి

-కాళేశ్వరంతో పొలాలకు గోదారమ్మ పరుగులు.. 

-39 లక్షల ఎకరాల్లో పంట సాగు 

గాదెల్లేకపోవచ్చు. గరిశలు కనుమరుగై ఉండవచ్చు. అయితేనేం. తెలంగాణ మొత్తమే పేద్ద గరిశగా మారుతున్నప్పుడు ఇండ్లలో బస్తాలు, బండ్లలో బోరాలు ఏం చాలుతాయి? తెలంగాణ ఈసారి అన్నపూర్ణగా మారుతున్నది.  కాళేశ్వరుడి దయతో లక్ష్మీ బరాజ్‌ నుంచి ఎగిసిన గోదావరి జీవధార మన పంటపొలాల్లో సిరులు పండించనున్నది. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో ఆవిష్కృతమైన నీలి నీటి దృశ్యం.. పంటచేలకు ఇప్పటికే పచ్చటి చీర కట్టి  మురిపించగా.. కోతకొస్తున్న వరిపొలాలు కొత్త బంగారు కాంతులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 39 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది. గతంలో ఇది ఎన్నడూ 17 లక్షల ఎకరాలు దాటలేదు. ఎకరానికి 40 బస్తాల చొప్పున లెక్కేసుకున్నా ఈసారి కోటీ 5 లక్షల టన్నుల వడ్లు రాష్ట్రంలో ఉత్పత్తి కానున్నాయి. తెలంగాణ ధాన్యాగారంగా, అన్నపూర్ణగా అవతరించనుంది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో యాసంగి వరి సిరులు కురిపించనున్నది.. ధాన్యంతో గాదెలు గలగలలాడనున్నాయి. కోటి టన్నులకు పైగా వడ్ల రాశులు తెలంగాణను మురిపించనున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి యాసంగిలో 39 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుకాగా.. 1.05 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో యాసంగి సాధారణ విస్తీర్ణం 17.08 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది అంతకు రెండింతలు మించి సాగయింది. గతేడాదితో పోల్చితే 16.15 లక్షల ఎకరాలు అధికం. 22 జిల్లాల్లో సాధారణానికి మించి వరిసాగుచేశారు. ఈ యాసంగిలో 35 లక్షల ఎకరాలకు సాగు లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొన్నది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో 25 లక్షలు.. చెరువులు, కుంటల పరిధిలో మరో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడం, మిడ్‌మానేరు, లోయర్‌మానేరుతోపాటు, కాకతీయ కెనాల్‌ ద్వారా సూర్యాపేట వరకు సాగునీరందించింది. నిజామాబాద్‌ జిల్లాలో లక్ష ఎకరాలకు, ఎల్లంపల్లి లిఫ్టు ద్వారా 50 వేలు, కడెం పరిధిలో 40వేలు, దేవాదుల పరిధిలో 1.5 లక్షల ఎకరాలతోపాటు, జూరాల పరిధిలో కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. వర్షాధార పంటల సాగే శరణ్యమైన తెలంగాణ భూములను వడ్లరాశులకు చిరునామాగా మార్చిన ఘన త తెలంగాణ ప్రభుత్వానిదే. ప్రత్యేక రాష్ట్రంలో మిషన్‌కాకతీయతో చెరువులను పునరుద్ధరించడం, యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేయడం, ముఖ్యంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రావడంతో వరి సాగు విస్తీర్ణం అమాంతంగా పెరిగింది. భూగర్భ జలా లు పెరుగడం, 24 గంటలు నిరంతరాయ క రంటు అందుబాటులో ఉండటం కూడా దోహదంచేశాయి. దీనికితోడు ప్రభుత్వమే కనీస మద్ద తు ధరకు వడ్లను కొనుగోలు చేస్తుండటంతో రైతు మరింత భరోసాతో వరి సాగువైపు మొగ్గుచూపా డు. వీటిన్నింటికీ 120 రోజుల్లో పంటకొచ్చే తెలంగాణ సోన రకం అందుబాటులోకి రావడంతో విస్తీర్ణం, దిగుబడి బాగా పెరిగాయి. దీంతో యాసంగిలో వరి ఉత్పత్తి మొట్టమొదటిసారిగా కోటి టన్నులు దాటుతున్నది. దీనిద్వారా రాష్ట్రంలోని రైతులు దాదాపు రూ.20 వేల కోట్ల ఆదాయం పొందనున్నారు.

వరిదే అగ్రస్థానం

2018-19 వానాకాలం సీజన్‌లో మొత్తం ఆహారధాన్యాల్లో వరిదే అగ్రస్థానం. వరి, చిరుధాన్యాలు 72 శాతం ఉంటే అందులో 54.7 శా తం వరిదే. ఆ ఏడాది వానాకాలంలో 11.89 లక్షల హెక్టార్లు, యాసంగిలో 7.43 లక్షల హెక్టార్లు కలిపి మొత్తం 19.32 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. మొత్తం ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 25.45 లక్షల హెక్టార్లు కాగా మొత్తం 88.34 లక్షల టన్నుల ఆహారపంటల ఉత్పత్తయ్యింది. ఇందులో 66.69 లక్షల టన్నులు కేవలం ధాన్యమే. అదేవిధంగా 2019-20 నాటికి రెండోముందస్తు అంచనాల ప్రకారం (జనవరి 2020 నాటికి)సాగుకు 27.72 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 98.74 లక్షల టన్నులుగా ఉన్నది. 2018-19తో పోలిస్తే విస్తీర్ణం 43.48 శాతం, ఉత్పత్తి 48.08 శాతం పెరిగింది. 

  • 2014-15, 2017-18ల మధ్య విద్యుత్‌ వాడకం హెక్టారుకు 1.98 కిలోవాట్ల నుంచి 3.35 కిలోవాట్లకు పెరిగింది.
  • 2020జనవరి 6 నాటికి ప్రభుత్వం 41.4 లక్షల టన్నుల వానకాలం ధాన్యాన్ని కనీస మద్దతుధర (క్వింటాల్‌కు గ్రేడ్‌ ఏ రూ.1,835, సాధారణం రూ. 1815 చొప్పున)కు కొనుగోలుచేసింది. రాష్ట్రంలో ఎక్కువ కనీస మద్ద తు ధర అందిన పంట వరి కావడం విశేషం.
  • మిషన్‌ కాకతీయ అమలుతో సుమారు 46 వేల పైచిలుకు చెరువులు మరమ్మతులు, పూడికతీతకు నోచుకున్నాయి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ ద్వారా 198.22 మిలియన్‌ క్యూసెక్కుల అదనపు నీటి స్టోరేజీ పెరిగింది. ఫలితంగా ఆయకట్టు ప్రాంతాల్లో వరి విస్తీర్ణం, దిగుబడి పెరిగింది. దీనివల్ల రబీ (యాసంగి) వరి ఉత్పాదకత 19 శాతం పెరిగినట్టు నిర్ధారణ అయింది.

ధాన్యం విలువ రూ.19,267.50 కోట్లు 

అంచనాల ప్రకారం యాసంగి వరి దిగుబడి 1.05 కోట్ల టన్నులు. ఈసారి ప్రభుత్వమే గ్రామాల్లో నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (క్వింటాల్‌కుగ్రేడ్‌ ఏ రూ.1,835, సాధారణం రూ. 1815 చొప్పున) కచ్చితంగా అందనున్నది. ఈ ప్రకారం యాసంగిలో పండే ధాన్యం విలువ రూ.19,267.50 కోట్లు. దీనిప్రకారం నాలుగేండ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెట్టిన ఖర్చులు తిరిగొస్తాయని అంచనా.


logo