హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష (సీయూఈటీ )యూజీ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్ష స్కోరు ఆధారంగా సెంట్రల్ వర్సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 24 వరకు సీయూఈటీ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 14,99,778 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. జాతీయంగా 295 పట్టణాల్లో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొత్తం మీద సీయూఈటీ పరీక్షను 21 నుంచి జూన్ 2 వరకు తిరిగి, జూన్ 5, 6 తేదీల్లో నిర్వహిస్తారు. జూన్ 7, 8లను బఫర్ తేదీలుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. అయితే, ఈ నెల 21 నుంచి 24న పరీక్షలు రాసే వారికి మాత్రమే అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. మిగతా తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్‌కార్డులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు ఏ నగరంలో పరీక్షలు రాయబోతున్నారో తెలిపే సిట్ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను ఇప్పటికే ఎన్టీఏ విడుదల చేసింది. నిరుడు సీయూఈటీకి 9.9 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది 15 లక్షలకు పెరగడం విశేషం.