హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయించాలని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం ఏరియాల జీఎంలను ఆదేశించారు. సమీప గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రతి ఏడాది సింగరేణి అనేక పనులు చేపడుతున్నదని, సింగరేణి అభివృద్ధితోపాటు.. సమీప గ్రామాల అభివృద్ధికి కూడా తగు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. బుధవారం సింగరేణి భవన్నుంచి అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సీఎస్ఆర్ పనుల పురోగతిపై సమీక్షించారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ కార్మిక సంక్షేమానికి, అలాగే సమీ ప గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనికి అనుగుణంగా ఆయా ఏరియాల్లోని యాజమాన్యాలు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు వేగంగా పూర్తి చేయాలని కోరా రు. ఈ సమీక్షా సమావేశంలో జనరల్ మేనేజర్లు ఎం సురేశ్, సీఎస్ఆర్ శ్రీకుమార్రెడ్డి, ఆయా ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.