 
                                                            హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాల్లో నేరుగా పాల్గొనకపోయినా, నేరస్తుల నుంచి డబ్బులు కోల్పోకపోయినా, ఈ రెండు వర్గాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని కొందరు బాధితుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అవుతున్న ఉదంతాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దృష్టి సారించింది. ఎవరో డబ్బులు పంపితే.. ఇంకెవరో ఫిర్యాదు చేస్తే.. వేరే ఎవరివో బ్యాంకు ఖాతాలు స్తంభించిపోతున్న ఈ కేసులు తెలంగాణలో ఈ మధ్య వెలుగు చూస్తుండటంతో వీటి పరిష్కారానికి ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇట్లాంటి బాధితుల పక్షాన నమస్తే తెలంగాణ ఆదివారం ‘నేరం చేయకున్నా నిందితుడే’ అనే శీర్షికన ఓ కథనం ప్రచురించింది. దీనిపై వెంటనే స్పందించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అకౌంట్ల అన్ఫ్రీజ్పై సమాలోచన చేస్తున్నట్టు తెలిపారు.
ఆ కథనంలో పేర్కొన్న ఓ బాధితుడికి స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులే కాల్ చేసి, వివరాలు తీసుకున్నారు. బ్యాంకు ఖాతా అన్‌ఫ్రీజ్ చేసేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యంగల నాగరాజు అనే బాధిత యువకుడు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపాడు. క్రెడిట్ కార్డులు ఇస్తామనో, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్స్, రమ్మీ గేమ్స్, ఫ్రీ ఫైర్, పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్‌ను నిర్వహిస్తున్న చైనా సైబర్ ముఠాలు.. ముగ్గులోకి లాగేందుకు ఎంతోకొంత నగదు ఖాతాల్లో వేస్తున్నారు. అలా వచ్చిన నగదును బాకీలు ఇవ్వాల్సిన వారికి చెల్లిస్తుండటంతో.. అనూహ్యంగా డబ్బులు రిసీవ్ చేసుకున్న బ్యాంకు ఖాతాలు కూడా స్తంభించిపోతున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచింగ్ స్టాఫ్‌గా ఉన్న మాధురి బ్యాంకు ఖాతా కూడా స్తంభించిపోయింది. ఇట్లాంటి బాధితులు ఎక్కువమందే ఉంటారని గ్రహించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు.. బాధితులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి బాధితుల అకౌంట్ల వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
 
                            