హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ‘సైబర్ జాగృత దివస్’ను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 325 ప్రాంతాల్లో సైబర్‌నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కళాశాలలు, వైద్యసంస్థలు, ప్రైవేట్ ఆఫీస్‌లు, ప్రజా సమావేశ స్థలాలు, బస్టాండ్లలో ఈ సెషన్లు నిర్వహించినట్టు పేర్కొన్నారు. కొత్త పద్ధతుల్లో పుట్టుకొస్తున్న సైబర్ నేరాలను అడ్డుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించామని వివరించారు.
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు సృష్టించి.. యూపీఐ, ఈ-వాలెట్ల ద్వారా మోసం చేస్తున్నారని తెలిపారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో గృహిణులు, నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. నకలీ నంబర్ ప్లేట్, ఫాస్టాగ్, హెచ్ఎస్ఆర్పీల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని.. ఈ తరహా మెసాలపై అవగాహన కల్పించామని చెప్పారు. సైబర్ నేరాల బారినపడిన వారు వాట్సాప్ నంబర్ 8712672222కు రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.