హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): చెన్నైలో మే 5న నిర్వహించనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై సీఎస్ శాంతికుమారి సోమవారం బీఆర్కే భవన్లో సమీక్షించారు. ఏపీ పునరవ్యవస్థీకరణ చట్టం, నీటిపారుదల, విద్య, వైద్యం, ఇంధనం, పరిశ్రమలు, సింగరేణి, పంచాయతీరాజ్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తదితర శాఖల అంతర్రాష్ట్ర సమస్యలపై చర్చించారు. పెండింగ్ బకాయిలు, క్లియరెన్స్‌లు, 9,10 షెడ్యూల్డ్ సమస్యలపై సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తే సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఎస్సీఎస్లు రాణి కుముదిని, సునీల్ శర్మ, రజత్ కుమార్, కే రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి కాలరీస్ సీఎండీ శ్రీధర్, కార్యదర్శులు శేషాద్రి, శ్రీనివాసరాజు, రఘునందన్ రావు, వాకాటి కరుణ, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.