హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తొలిసారిగా క్రిప్టో కరెన్సీని రికవరీ చేసినట్టు డీజీ శిఖాగోయెల్ సోమవారం వెల్లడించారు. మంచిర్యాలకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరస్థుడు భరత్ మ్యాట్రిమోనీలో నందితరెడ్డిగా పరిచయం చేసుకుని రూ.87,58,356 మోసం చేశాడు. ఈ కేసులో ఫిర్యాదు స్వీకరించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. విచారణ చేపట్టి నిందితుడి వాలెట్ నుంచి సుమారు 2,703 యూఎస్డీటీ (రూ.2.38 లక్షలు) విలువైన క్రిప్టో కరెన్సీని రికవరీ చేశారు. రెండేండ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగి మ్యాట్రిమోనీలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటే.. గత జనవరి 18న నందితరెడ్డి అనే పేరుతో రిక్వెస్ట్ వచ్చింది. వాట్సాప్ నంబర్ ద్వారా తమ ఇష్టాఇష్టాలు పంచుకున్నారు. ఆ తర్వాత మాట్లాడటం మొదలుపెట్టి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల గురించి చెప్పి ముగ్గులోకి దింపింది.