భద్రాచలం, డిసెంబర్ 30: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలు భద్రాచలం ఐటీడీఏ వద్ద చేస్తున్న సమ్మె సోమవారం పదో రోజుకు చేరుకుంది. ఐటీడీఏ వద్ద మోకాళ్లపై పాకుతూ, పొర్లు దండాలు పెడుతూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. దీంతో ఐటీడీఏ పీవో రాహుల్, డీడీ మణెమ్మ సీఆర్టీలను చర్చలకు ఆహ్వానించారు. సమస్యలను, డిమాండ్లకు సీఆర్టీలు పీవోకు, డీడీకి వివరించారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. సీఆర్టీల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శివనాయక్, రాష్ట్ర నాయకులు నరేశ్, హరిరాం రాందాస్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు సక్రం, శ్రీనివాస్, ఐటీడీఏ ఇన్చార్జి రాజేశ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సరస్వతి పాల్గొన్నారు.
సీఆర్టీల రెన్యువల్‌కు ఆమోదం
కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను ప్రభుత్వం రెన్యువల్ చేసింది. సోమవారం రేవంత్‌రెడ్డితో మంత్రి సీతక్క సమావేశమై చర్చించారు. సీఆర్టీల రెన్యువల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఫైల్‌పై వెంటనే సంతకం చేశారు. 3 వేల మంది సీటీఆర్ల రెన్యువల్‌కు సీఎం ఆమోదం తెలిపారు. ఈ అంశంపై వెంటనే స్పందించిన సీఎంకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు.