పంటలెట్ల ఎండుతున్నయంటే..?
సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఓ వైపు సరైన వర్షాలు లేకపోవడం.. మరోవైపు విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ సమస్యతో నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రైతులు జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకొందరు చేసేదేమీ లేక పొలాలను పశువుల మేతకు వదిలేస్తున్నారు. సాగు నీరందించాలని కోరుతూ రైతులు అక్కడక్కడా నిరసనలు చేపట్టారు.
సీతాయిగూడెంలో అన్నదాతల ఆందోళన
పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక పచ్చని వరిపొలాలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో వెంగళరావు ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టు కింద నీరులేక ఎండిపోయిన వరిపొలాల్లో నిలబడి అన్నదాతలు నిరసన తెలిపారు. అలుగు మరమ్మతుల పేరుతో కుడికాలువకు వచ్చే నీటిని వాగులోకి వృథాగా మళ్లించడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ప్రాజెక్టు కింద 500 ఎకరాలు ఎండిపోతున్నా అధికారులకు
కనిపించటం లేదా? అంటూ మండిపడ్డారు.
– చండ్రుగొండ

ఎండిన పైరు.. రైతు కంట కన్నీరు
వరి పొట్ట దశకు చేరుకున్న వేళ నీరందక పంట కండ్లముందే ఎండిపోతున్నదంటూ యాదాద్రి జిల్లా రాజాపేట మండలం మల్లెగూడేనికి చెందిన రైతు రెడ్డబోయిన నరసయ్య ఆందోళన చెందుతున్నాడు. ఓ వైపు కరెంట్ కోతలు.. మరోవైపు అడుగంటిన భూగర్భ జలాలు.. వెరసి పంటకు ప్రాణసంకటంగా మారాయి. పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలి? అంటూ పొలంలోనే కంటతడి పెట్టి దిగాలుగా కూర్చున్నాడు.
-రాజాపేట

పంట.. పశువుల పాలాయే!
నారాయణపేట జిల్లా మరికల్ మండలం బుడ్డెగానితండాకు చెందిన రైతు పాండునాయక్ ఎనిమిదెకరాల్లో వరి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.2.40 లక్షలు ఖర్చు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో బోరులో నీరు ఇంకిపోయింది. ఎలాగైనా పంటను కాపాడుకోవాలన్న తపనతో రూ.3 లక్షలతో కొత్తగా 8 బోర్లు డ్రిల్లింగ్ చేయించినా చుక్కనీరు పడలేదు. ఇక పంటకు నీటి తడులు అందించలేనని నిర్ణయించుకున్న రైతు మంగళవారం వరి పొలాన్ని ఆవులు, బర్రెల మేతకు వదిలేశాడు.
– మరికల్

సదర్మాట్ నీటి కోసం రైతుల నిరసన
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని సదర్మాట్ కాలువ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందకపోవడంతో మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. పెద్దూర్‌తండా రైతులు ఎండిపోయిన కుంటలో దిగి నిరసన తెలిపారు. చివరి ఆయకట్టుకు నీరందకపోతే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
– కడెం

జనరేటరే దిక్కాయే..
చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు చి‘వరి’ ప్రయత్నాలు చేస్తున్నారు. జనరేటర్లు ఏర్పాటు చేసి నీటి తడులు అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన రైతు దేవరాజు తన పంటను దక్కించుకునేందుకు జనరేటర్ ఏర్పాటు చేసుకున్నాడు. జనరేటర్ కిరాయి, డీజిల్ వంటి ఖర్చులతో భారం పడుతున్నా వేరే గత్యంతరం లేక భరిస్తున్నట్టు రైతు దేవరాజు వాపోయాడు.
– మాచారెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Crops
- farmers
- Generators
- water
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

