నిర్మల్ : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలని రాష్ట్ర అటవి, న్యాయ శాఖ మంత్రి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలపై నిర్మల్‌లో బీఆర్ఎస్(BRS) జిల్లా ఇన్చార్జి గంగాధర్‌గౌడ్ మంత్రితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం అవలంభిస్తున్న వివక్ష, కక్ష సాధింపులను ప్రజలకు వివరించాలని సూచించారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరలపై పెంపు తదితర అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు నెలల పాటు బీఆర్ఎస్ (BRS) చేపట్టే కార్యక్రమాల రూపకల్పన, వాటి అమలుపై విస్తృతంగా చర్చించారు.
భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ శ్రేణులు అందర్నీ ఏకం చేసేలా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి కార్యచరణను రూపొందించాలని సూచించారు. సమావేశాల నిర్వహణను పార్టీ జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని, ప్రతి పది గ్రామాలను యూనిట్ గా, పట్టణాల్లోని డివిజన్లుగా తీసుకుని ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.