నర్సంపేట రూరల్, జూన్ 25: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన అభ్యర్థులను విడుదల చేసి, వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్లో వారికి అవకాశం ఇవ్వాలని కోరారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇటీవల జరిగిన పోలీసు కాల్పుల్లో మృతిచెందిన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబీర్‌పేటకు చెందిన రాకేశ్ కుటుంబాన్ని శనివారం నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌తో కలిసి వినోద్‌కుమార్ పరామర్శించారు. రాకేశ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతని తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యంచెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో వినోద్ మాట్లాడారు. మూడేండ్లుగా ఆర్మీ పరీక్ష కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అగ్నిపథ్ పథకంతో ఆందోళనకు గురై, భావోద్వేగంతో నిరసనకు దిగారని, ఇది క్రూరమైన కుట్ర కాదని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(2) ప్రకారం త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ రాష్ట్రపతి అని, ఆయనకు ఉన్న విశేష అధికారాలతో ఆర్మీ అభ్యర్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విన్నవించారు.
ప్రధాని నరేంద్ర మోదీ దివాలాకోరు, అనాలోచిత చర్యలు దేశానికి ప్రమాదకరంగా మారాయని వినోద్‌కుమార్ మండిపడ్డారు. మోదీ నిజమైన దేశభక్తుడైతే ఆర్మీలో అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేవారే కాదని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ చట్టాల వంటి అనాలోచిత నిర్ణయాలకు తాజాగా అగ్నిపథ్ పథకం వచ్చి చేరిందని విమర్శించారు. 2018, 2019 సంవత్సరాల్లో చాలామంది ఆర్మీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వారంతా 2020లో ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయ్యారని గుర్తుచేశారు. 2021 మార్చిలో మెడికల్ టెస్ట్ పూర్తయ్యిందన్నారు. అన్ని పరీక్షలు పాసై, రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అగ్నిఫథ్ పథకాన్ని ప్రారంభించి కేంద్రం యువకుల జీవితాలతో ఆడుకుంటున్నదని ఆరోపించారు. రాకేశ్ హత్యకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగేండ్లే ఉండే ఉద్యోగం కోసం ఎవరైనా ప్రాణత్యాగం చేస్తారా అని వినోద్‌కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆర్మీలో సైనికులు నాలుగైదేండ్ల కఠోర శిక్షణలో రాటుదేలుతారని చెప్పారు. నాలుగేండ్ల లోపే రిటైర్ అయ్యే అగ్నిపత్ పథకంలో సైనికులు ఎలాంటి శిక్షణ లేకుండా శత్రుదేశాలతో ఎలా పోరాడుతారని ప్రశ్నించారు. అమెరికాను మోదీ ఉదాహరణగా చెపుతున్నారని, ఆ దేశానికి సరిహద్దులో కెనడా, మెక్సికో వంటి శాంతిపూర్వక, స్నేహశీలి దేశాల్లో సాయుధ సైనికుల అవసరమే లేదని వివరించారు. భారత్‌కు సరిహద్దుల్లో క్రూరమైన శత్రుదేశాలు పొంచి ఉన్నాయని, అందుకే త్రివిధ దళాల్లో 14 లక్షల మంది సాయుధ సైనికులు ఉన్నారని చెప్పారు. బడ్జెట్లో కోతలు పెట్టేందుకు ఆర్మీ రిక్రూట్మెంట్లో దివాలా కోరు పద్ధతులను మోదీ తెస్తున్నారని, ఇది దేశ భద్రతకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంచేశారు.