హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికి వదిలేయడంతో రోజుకు సగటున 10 రేప్‌లు, 4 కిడ్నాప్‌లు, 3 హత్యలు జరుగుతున్నాయి. హతుల్లో ఓ మహిళ ఉంటున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం వార్షిక నేరాల నివేదికలో వెల్లడించారు. రాష్ట్రంలో నేరాలు 2.33% తగ్గినట్టు డీజీపీ చెప్తున్నప్పటికీ దారుణ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నట్టు తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. ఈ నివేదిక ప్రకారం.. 2023లో జనవరి నుంచి నవంబర్ వరకూ 2,13,121 కేసులు, 2024లో 2,34,158 కేసులు, 2025లో 2,28,695 కేసులు నమోదయ్యాయి. నిరుటితో పోల్చితే ఈ ఏడాది కేసుల సంఖ్య స్వల్పంగా 2.33% తగ్గింది. 2023లో కేవలం 70,469గా ఉన్న ఐపీసీ నేరాల కేసులు 2024లో 1,69,477కు పెరిగాయి. ఈ ఏడాది ఈ కేసులు స్వల్పంగా 1.45 తగ్గి 1,67,018కు చేరాయి. దీన్ని బట్టి తెలంగాణలో గత రెండేండ్ల నుంచి శాంతిభద్రతలు అదుపులోకి రావడంలేదని స్పష్టమవుతున్నది.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు నానాటికి పెరుగుతున్నాయి. వరకట్న వేధింపులు, ఇతర దారుణాలకు నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ బలవుతుండగా.. ప్రతి రెండున్నర గంటలకు ఒకటి చొప్పున రోజుకు 10 వరకూ రేప్‌లు జరుగుతున్నాయి. గత 11 నెలల్లో 2,549 రేప్ కేసులు, బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 69 కింద మరో 843 రేప్ కేసులు కలిపి మొత్తం 3,392 కేసులు నమోదయ్యాయి. నిరుటి కంటే ఇవి 14% అధికం. ఈ కేసుల్లో 30% శాతం దళితబిడ్డలే బాధితులుగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. 98% రేప్ కేసుల్లో బాధితులకు తెలిసినవారే నిందితులుగా ఉండటంతో ఆడబిడ్డలకు ఇండ్లలో కూడా భద్రత కరువైనట్టు స్పష్టమవుతున్నది.
ఈ ఏడాది రాష్ట్రంలో మొత్తం 22,882 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 25,074 మంది అదృశ్యమయ్యారని, వారిలో 21,754 మందిని ట్రేస్ చేశామని డీజీపీ చెప్పారు. దీన్ని బట్టి ప్రతి గంటకూ ముగ్గురు, రోజుకు 74 మంది చొప్పున అదృశ్యమవుతున్నట్టు తెలుస్తున్నది. వీటితోపాటు రాష్ట్రంలో స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్న కేసులు ఈ ఏడాది 9% పెరిగాయి. నిరుడు 1,122గా ఉన్న కిడ్నాప్ కేసుల సంఖ్య ఈ ఏడాది 1,003కు తగ్గింది.
తెలంగాణలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు దాదాపు 6% పెరిగాయి. 2023లో మొత్తం 20,699 రోడ్డు ప్రమాదాల కేసులు నమోదవగా.. నిరుడు వాటి సంఖ్య 23,491కు, ఈ ఏడాది 24,826కు చేరాయి. నిరుడు సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 7,057 మంది మృతిచెందగా 21,664 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఏడాది కూడా 6,499 మంది చనిపోయారు. మరో 14,765 మంది క్షతగాత్రులైనట్టు డీజీపీ చెప్పారు.
