హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సైబరాబాద్‌లో నేరాలు భారీగా పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈసారి క్రైం రేట్ ఏకంగా 64 శాతం పెరిగి 14,830 కేసులు అధికంగా నమోదయ్యాయి. 2023లో 22,859 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 37,689 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో సైబర్ నేరాలలో 122 శాతం పెరుగుదల నమోదైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2024 వార్షిక నివేదిక విడుదల చేశారు. దీని ప్రకారం నేరాల పెరుగుదల విషయంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో సైబరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఇప్పటికే 2024 వార్షిక నివేదికను విడుదల చేశారు. నివేదిక విడుదల అనంతరం అవినాష్ మహంతి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోనే సైబరాబాద్‌లో కేసుల సంఖ్య పెరిగినట్టు చెప్పారు.
సైబర్ నేరాలతోపాటు ఆస్తుల గొడవలు, రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, సాధారణ దాడులు, ట్రెస్పాస్, వరకట్న వేధింపులు కూడా పెరిగినట్టు తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగినా వాటిలో మరణాల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన మోసాల కేసుల్లో దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని, దీనికి ఈ ఏడాది మార్చి వరకు 90 కేసులు నమోదైనట్టు వివరించారు. ఇక, సైబర్ నేరాల కారణంగా 2023లో రూ. 269 కోట్ల నష్టం వాటిల్లగా, 2024లో నవంబర్ వరకు రూ. 793 కోట్ల నష్టం జరిగింది. ఇందులో రూ. 70,46, 11,458ను బాధితులకు తిరిగి చెల్లించారు. ప్రధానంగా పార్ట్‌టైమ్ జాబ్స్, ట్రేడింగ్, స్మిషింగ్ నేరాలు అధికంగా జరిగాయి. 2023లో 102 డిజిటల్ అరెస్ట్‌లు నమోదు కాగా, ఈ ఏడాది వాటి సంఖ్య 1002కు పెరిగింది.
సైబరాబాద్ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్న కొన్ని నేరాల వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు సంబంధించి వివరాలను పొందపర్చలేదు. 2024లో 10 రకాలైన గ్రేవ్ కేసులకు సంబంధించిన డిటెక్షన్ వివరాలను మాత్రం వెల్లడించారు. ఇందులో 2024 వివరాలు మాత్రమే ఉన్నాయి. సైబర్‌క్రైమ్, ట్రాఫిక్, ఎన్డీపీఎస్ యాక్ట్‌లకు సంబంధించిన కేసుల వివరాలను స్పష్టంగా వెల్లడించిన పోలీసులు, కొన్ని గ్రేవ్ కేసుల్లో మాత్రం దాగుడుమూతలు అడినట్టు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ‘ఫిర్యాదులు వచ్చాయి, కేసులు నమోదు చేస్తున్నాం. కేసులను బట్టి నేరాలు పెరుగుతున్నాయనుకోవడం సరికాదు. ఫిర్యాదులపే నమోదు చేస్తుండటంతో ఎఫ్ఐఆర్ల సంఖ్య పెరుగుతున్నది’అని సీపీ వివరించారు.