హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అన్ని రకాల పోలీసు అనుమతులను ఆన్లైన్లోనే జారీ చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. కమిషనరేట్‌లో శుక్రవారం ‘సైబరాబాద్ పోలీస్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్(సీపీపీఎంఎస్)’ పోర్టల్‌ను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకు పోలీసు అనుమతుల కోసం దరఖాస్తుదారులు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.
ఇకపై అలా ఉండదని, వివరాలను ఆన్లైన్లో పూర్తిచేసి పేమెంట్ సైతం చెల్లించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) సహకారంతో రూపొందించిన సీపీపీఎంఎస్తో దరఖాస్తుదారుల సమయం వృథా కాదన్నారు. ప్రస్తుతం కమర్షియల్, టికెట్లతో కూడిన ఈవెంట్లు, బ్లాస్టింగ్‌లకు సంబంధించిన అనుమతులను ఆన్లైన్లో జారీ చేస్తున్నామని వారం, పది రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. 3నెలల్లో అన్ని రకాల అనుమతులను ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ(ట్రాఫిక్) జోయల్ డేవిస్ పాల్గొన్నారు.