చిట్యాల, ఆగస్టు 30 : మునుగోడు ఉప ఎన్నికలో మతోన్మాద బీజేపీని ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో మంగళవారం జరిగిన నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ తన నిజస్వరూపాన్ని బయటపెడుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు.
వివిధ రాష్ర్టాల్లో ఎన్నికైన విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చే పనిలో నరేంద్ర మోదీ నిమగ్నమయ్యారని విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కారు.. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నదన్నారు. దుర్మార్గమైన విధానాలను అనుసరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.