హైదరాబాద్,నవంబర్ 13 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సర్వేలో ఆస్తులు, రాజకీయ, వ్యవసాయ భూములకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రశ్నలు ఎందుకని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. వ్యక్తిగత వివరాలను ఇవ్వడానికి ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. అటువంటి ప్రశ్నలను తొలగించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశా రు. వ్యక్తిగత ప్రశ్నలకు సంబంధించిన వివరాలు వెల్లడించే క్రమంలో కొన్ని చోట్ల ప్రజలు ఎన్యుమేటర్లపై దాడులు చేస్తున్నారని వాపోయారు. రేషన్ కార్డులు తొలగించడానికి, సంక్షేమ పథకాలు రద్దు చేయడానికే సర్వే చేస్తున్నారని ప్రజల్లో సందేహాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి, అఖిలపక్ష సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేసి, సర్వే సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తమ్మినేని సూచించారు.