హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 12,13,14 తేదీల్లో మూడురోజులపాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగాయి. కేంద్ర పరిశీలకులుగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఏ విజయరాఘవన్ హాజరయ్యారు. సమావేశం వివరాలను శుక్రవారం తమ్మినేని మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. పోటీచేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తకువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని వివరించారు. తమకు సీపీఎం కుటుంబాలే ఓటేశాయి తప్ప సంప్రదాయంగా వేసే అభిమానులు వేయలేదని వివరించారు. దీంతో సీపీఎం ఓట్ల శాతం పడిపోయిందని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు బలపడడానికి ఇది సంకేతంగా ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే రెండు గ్యారంటీలను అమలు చేయడం శుభపరిణామమని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడటం బాధాకరమని అన్నారు.