CPM Leader Tammineni | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్వవహరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కవిత పట్ల బీజేపీ చూపుతున్న పక్షపాతాన్ని ఖండిస్తున్నామన్నారు. అయినా తప్పును సమర్థించబోమని అన్నారు. ఆమె దోషిగా తేలితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, కవిత కూడా అదే విషయం చెబుతున్నదని చెప్పారు. ఇప్పటి వరకు బీజేపీ మీద వచ్చిన ఆరోపణలతో పోలిస్తే కవిత మీద వచ్చినవి చాలా స్వల్పమని పేర్కొన్నారు. కానీ.. మోదీ ప్రభుత్వం సీఎం కేసీఆర్.. తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడనే నెపంతో రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ చర్యకు పాల్పడుతున్నదని, దీనిని ఖండిస్తున్నామన్నారు.
పెద్ద పెద్ద కుంభకోణాలు చేసిన అదానీ వంటి వాళ్ల జోలికి ఎందుకు పోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని తమ్మినేని ప్రశ్నించారు. హైదరాబాద్లో జరిగిన సీపీఐ, సీపీఎం ముఖ్య నాయకుల సమావేశంలో కొన్ని నిర్ణయాలు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో, ప్రజా ఉద్యమాల్లో ఇరు పార్టీలు ఐక్యంగా పని చేయాలని నిర్ణయించాయన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సీపీఎం చేపడుతున్న బస్సుయాత్రలకు సీపీఐ సంఘీభావం తెలుపుతున్నదని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో సీపీఐ నిర్వహించే యాత్రలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదన్నారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన ఇరు పార్టీలకు చెందిన ఆరేడు వేల మంది ముఖ్య నాయకుల సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.