సంగారెడ్డి : ప్రధాని మోదీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం(CPM) నాయకుడు ప్రకాష్ కారత్(Prakash Karat) అన్నారు. జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో ప్రారంభమైన సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహా సభలో పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభల్లో సీతారాం ఏచూరి లేకపోవడం బాధాకరం అన్నారు. ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కి మద్దతిస్తుంది కానీ పాలస్తీనాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు.
దేశాన్ని మొత్తం ఒకే మతానికి పరిమితం చేయాలని చూశారు. బిజెపి నిర్ణయాలతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులు అనే రెండు పిల్లర్లపై మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందని గుర్తు చేశారు. నూతన ఆర్థిక విధానాలు, సామాజిక అణిచివేత, కుల వివక్షపై పోరాడాలని పిలుపునిచ్చారు.