హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): కుదేలవుతున్న చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేయడం శవాల మీద పేలాలు ఏరుకున్నట్టేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు పనులు లేక అల్లాడుతుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేనేత వస్ర్తాలకు జీఎస్టీలో మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమన్నారు.
చేనేత రంగాన్ని రక్షించేందుకు కొత్త పథకాలను తేవాల్సింది పోయి కార్మికుల పొట్టగొడుతున్నారని, వారి శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. దేశ, విదేశాలలో చేనేతకు ఆదరణ ఉన్నదని, వాణిజ్యపరంగా వారికి చేయూత ఇవ్వాలని కోరారు. వెంటనే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులు చేసే ఆందోళనలకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.