హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన పేరిట ఉత్సవాలు నిర్వహించడమెందుకో అర్థం కాలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఐ కార్యాలయం(ముగ్దుంభవన్)లో శనివారం విలేకరులతో మాట్లాడారు. తొలి తెలంగాణ పోరాట యోధులు సురవరం సుధాకర్‌రెడ్డి, చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను యూనివర్సిటీలకు పెట్టడం, గద్దర్ పేరిట అవార్డులు అందజేయడాన్ని అభినందించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, ఎన్ బాలమల్లేశ్, కలవేణ శంకర్, ఎం బాలనర్సింహా పాల్గొన్నారు.
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నరు..
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ తమ చరిత్రగా చెప్పుకునేందుకు కొన్ని పార్టీ లు కుట్రలు పన్నుతున్నాయని పలువురు వక్తలు మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సభ శనివారం రావి నారాయణరెడ్డి ఆడిటోరియం లో ఘనంగా నిర్వహించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రొఫెసర్ హరగోపాల్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.