హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కుట్రలుచేస్తే కేంద్ర ప్రభుత్వం తాటతీస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా హెచ్చరించారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, ఎమ్మెల్యేలను కొనడం, అడ్డదారిన ప్రభుత్వాలను ఏర్పాటుచేయడం వంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాలని, గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
‘ఫెడరలిజాన్ని రక్షించాలి’ అనే నినాదంతో దేశవ్యాప్త ప్రదర్శనలు నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహంవద్ద గురువారం ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ శ్రేణులు నల్ల చొకాలు, చీరలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ.. బీజేపీయేతర ప్రభుత్వాలను, ఆ రాష్ట్రాల ప్రజాస్వామ్య అధికారాలను దెబ్బతీయడానికి గవర్నర్లను రాజకీయ యుద్ధ గుర్రాలుగా బీజేపీ ఉపయోగించుకుంటున్నదని విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, నాయకులు వీఎస్ బోస్, ఈటీ నరసింహ, ఎస్ ఛాయాదేవి, బీ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.